వేమన చరిత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన సుమారు 1352-1430 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు అని ప్రచారంలో ఉంది. అయితే ఆయన కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని పరిశోధకులు అంటున్నారు.
వేమన రాసిన...


నందన సంవత్సరమున బొందుగ
నాశ్వ(యు)జ శుద్ధవున్నమి నాడున్
బృందార కాద్రి సేతువు నందున నొక
వీర వరుని జన్మము వేమా!


(నందన సంవత్సరమున = నందన నామ సంవత్సరము, నాశ్వయుజ శుద్ధ పున్నమి నాడు = ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున, బృందారక = ఘనమైన, అద్రి = కొండల, సేతువు = జల వనరుపై నిర్మించిన వంతెన, నొక వీర వరుని జన్మము) అని చెప్పడం ద్వారా కొండల నడుమ ఉన్న సేతువు తన జన్మ స్థలమని వేమన చెప్పుకున్నట్లు చారిత్రాకారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొండల నడుమ ప్రవహిస్తున్న జల వనరులతో కూడిన ప్రదేశం ఉండేది కడప జిల్లా వేంపల్లికి సమీపంలోని "గండి"లో ఉన్న 'వీరన్న గట్టుపల్లి" గ్రామం మాత్రమే. ఇక్కడ పాపాగ్నినది శేషాచల కొండల శ్రేణిని చీల్చుతూ సేతువుని ఏర్పరుస్తుంది. దీంతో అదే ఆయన జన్మస్థలంగా విశ్వసిస్తున్నారు.


వేమన జీవితం గురించి పెద్దగా పరిశోధన జరుగక ముందు

నేదునూరి గంగాధరం సంకలం చేసిన "5000 వేమన పద్యాలు" పుస్తకం ఆరంభంలో ఇచ్చిన కధ. కొండవీడు పాలించిన కుమారగిరి వేమారెడ్డి కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు భిల్లకన్యను వివాహమాడి అడవిలోని పరుసవీది జలాన్ని సంగ్రహించాడు. ఒక కోమటి మిత్రుడు ఆ బ్రాహ్మణుని నుండి పరుసవేదిని కుయుక్తితో తీసుకొని ఆ బ్రాహ్మణుని మరణానికి కారకుడయ్యాడు. ఇది తెలిసి రాజు కుమారగిరి వేమారెడ్డి కోమటి సంపదను స్వాధీనం చేసుకొన్నాడు. కోమటి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ హత్యాపాతకం పోవడానికి కోమటి వేమారెడ్డి పలు ధర్మకార్యాలు చేయడమే కాకుండా తన పిల్లలకు ఆ బ్రాహ్మడి పేరూ, కోమటి పేరూ పెట్టాడు. అలా అతని కొడుకులు పెదకోమటి వెంకారెడ్డి, రాచవేమారెడ్డి, వేమారెడ్డి. ఈ మూడవ కొడుకే వేమన కవి అయ్యాడు. యవ్వనంలో వేమన వేశ్యాలోలుడై తిరిగేవాడు. బంధువులు అతన్ని అసహ్యించుకొనేవారు కాని వదిన మాత్రం చిన్నపిల్లవాడిని వలె ఆభిమానించేది. ఒక వేశ్య అతనిని వలలో వేసుకొని, అన్ని నగలు సాధించుకొని, తుదకు అతని వదినగారి ముక్కు బులాకీ తెమ్మని అడిగింది. మంగళసూత్రం వలె ముత్తయిదు చిహ్నమైన బులాకీ ఇవ్వడానికి ముందు వదిన పెట్టిన నియమం వల్ల వేమన తాను తుచ్ఛమైన శారీరిక సౌఖ్యాలకోసం వెంపర్లాడుతున్నానని గ్రహించాడు. జ్ఞానాన్ని ప్రసాదించిన వదినకు ప్రణమిల్లాడు. వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవాడు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నాడు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నాడు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పాడు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించాడు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందాడు.

 

 

పరిశోధనాత్మక జీవిత చిత్రం


వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, తరువాత మరికొందరు అధ్యయనం చేశారు. వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి వంటి పండితులు, పరిశోధకులు పలు అభిప్రాయాలు తెలిపారు. వీటి సారాంశం త్రిపురనేని వెంకటేశ్వరరావు రాసిన "వేమన - పదహారేళ్ళ పరిశోధన"లో ఉన్నది. అతని కాలం గురించి ఇప్పటి వరకు ఏకాభిప్రాయం లేదు.

త్రిపురనేని వెంకటేశ్వరరావు అభిప్రాయం ప్రకారం వేమన జీవితం గురించి...

వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయు. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగాడు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడ ఒక ఇల్లు (విడిది) ఉంది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. సంస్కృతం, గణితం నేర్చుకొన్నాడు. పద్దులు వ్రాయగలడు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నాడు. నీతిని తెలిసినవాడు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు. కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు. (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటాడు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటి పనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును. అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనాడు. ఎందరో యోగులను, గురువులను దర్శించాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే "వెర్రి వేమన్న" అని అభివర్ణించుకొన్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రభోధించాడు. ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్ధిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో) మహాసమాధి చెందాడు. కదిరి తాలుకా కటారుపల్లె ఇప్పటికీ ఉన్న ఓ ప్రాచీన సమాధి వేమనదిగా ప్రసిద్ధమైనది.  


వేమన దృక్పథం 

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు.

ఉదా:

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.


కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు.

ఉదా:

అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం.

ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి. వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు. బ్రౌను కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.

 

వేమన గురించి శోధన, పరిశోధన

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంధస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. వేమన గురించి పరిశోధించి ఆంధ్రులందరికీ తెలియజేసింది పాశ్చాత్యులైన సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులే అని గ్రహించాలి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు. తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయడానికి కృషి చేసినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాలకై రెడ్డి కృషి చేశారు. ఈ సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది.  కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరవర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. డా. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుతో వేమన చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ రాయించి 14 భాషల్లోకి అనువదించింది. ఆంగ్ల, యూరపు భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదించింది.  


హేతువాది

ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చును. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను అంత నిశితంగా ఎత్తిచూపడానికి చాలా ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి.

ఇతరుల సొమ్ముకు ఆశించే లక్షణం "వెన్నదొంగ"లోనూ కనిపిస్తింది.
పాలకడలిపైన పవ్వళించినవాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి
విశ్వదాభిరామ వినురవేమ!.


బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు?

కనక మృగము భువిని కద్దులేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వదాభిరామ వినురవేమ!.

విగ్రహారాధనను విమర్శిస్తూ
 
పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?
విశ్వదాభిరామ వినురవేమ!.

కులవిచక్షణలోని డొల్లతనం గురించి

మాలవానినంటి మరినీట మునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?
తీపి విశ్వదాభిరామ వినురవేమ!.

ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.


వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు.

No comments:

Post a Comment